Computer Notes

 

కంప్యూటర్ అంటే ఏమిటి?

కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలి. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.

  • కన్సైజ్‌ ఆక్స్‌ఫ‌ర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.[1]
  • వెబ్‌స్టర్స్ ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.[2]
  • సురేశ్‌ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది.[3]

చరిత్ర

మొదట్లో రెండు రకాల కంప్యూటర్లు వాడుకలో ఉండేవి. అంక కలన యంత్రాలు (digital computers), సారూప్య కలన యంత్రాలు (analog computers). మధ్యలో కొన్నాళ్ళపాటు సంకర కలన యంత్రాలు (hybrid computers) వచ్చేయి. పోటీలో అంక కలన యంత్రాలు గెలవటం వల్ల ఇప్పుడు 'అంక' అన్న విశేషణాన్ని తీసేసి మామూలుగా కలన యంత్రం అని కాని, కంప్యూటర్‌ అని కాని అనెస్తున్నారు. ఈ మధ్య కాలము లో కంప్యూటరు ను "సంగణకము" అనే పిలుపు ప్రాచుర్యము పొందుతోంది.


ఈ రోజుల్లో ఎక్కువ వాడుకలో ఉన్న కంప్యూటర్‌ ని పోలిన యంత్రాలు మొట్టమొదట రెండవ ప్రపంచ యుద్దం అంతం అయే రోజులలో వెలిసేయి. పూర్వం ఈ కలన యంత్రాలు చాల భారీగా ఉండేవి. ఒకొక్క యంత్రానికి ఒకొక్క పెద్ద గది కావలసి వచ్చేది. పైపెచ్చు ఒకొక్కటి కోట్ల కొద్ది రూపాయలు ఖరీదు చేసేది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అధిస్థాపన (establishment) కనుక ఈ యంత్రాన్ని ఎంతోమంది ఉమ్మడిగా వాడుకొనే వారు. ఇటువంటి ఉమ్మడి యంత్రాలు ఇప్పుడూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇటువంటి వాటిని ప్రత్యేక వైజ్ణానిక అవసరాలకు ఉపయోగించుతున్నప్పుడు సూపరు కంప్యూటరు అని, పెద్దపెద్ద సంస్థల వ్యాపార లావాదేవీలు (transactions) సంవిధానం (processing) చేస్తున్నప్పుడు మెయిన్ ఫ్రేము కంప్యూటరు అని సంభోదిస్తూ ఉంటారు. ఇవి అపరిమితమయిన గణన సౌకర్యాలు కలిగి ఉంటాయి.


ఈ రోజుల్లో కంప్యూటర్లు బాగా శక్తివంతమూ అయేయి, చవకా అయేయి; పైపెచ్చు బాగా చిన్నవీ అయేయి. దాని వల్ల భారీ యంత్రాల వాడుక పడిపోయింది; ఎవరి కంప్యూటరు వారే సొంతంగా కొనుక్కోగలిగే స్థాయికి ఎదిగేం. ఈ సొంత కంప్యూటర్లనే ఆంగ్లంలో personal computer అనీ, హ్రస్వంగా PC అనీ, తెలుగులో వ్యక్తిగత కంప్యూటరు అనీ అంటున్నారు. ఈ సొంత కంప్యూటర్లు బల్లమీద పెట్టుకునే రకాలు (desktop), ఒళ్ళో పెట్టుకునే 'ఉరోపరి' (laptop), చేత్తో పట్టుకునేవి (hand-held) అలా రకరకాల ప్రమాణాల్లో వస్తున్నాయి. పుస్తకం సైజులో ఉన్నవాటిని నోటుబుక్కు కంప్యూటరు అని పిలుస్తారు. ఇతర వస్తువులను నియంత్రించుటకు ఉపయోగించే వాటిని embedded computers అంటారు. ఉదాహరణకు డిజిటలు కెమెరాలు, ఉతికే యంత్రాలు (వాషింగు మెషీనులు) మొదలగు వాటిలో వాడే కంప్యూటర్లు ఎంబెడెడు కంప్యూటర్లు. అంతేకాదు పెద్ద విమానాలను సైతం నడిపే కంప్యూటర్లను ఎంబెడెడు కంప్యూటర్లు అనవచ్చు. పెద్దదైనా, చిన్నదైనా కంప్యూటరు పనిచేసే పద్ధతి ఒక్కటే. సిద్ధాంతమూ ఒక్కటే.

ఇంకా కొత్త కొత్త రకాల కంప్యూటర్లు పరిశోధన స్థాయిలో ఉన్నాయి. క్వాంటం శాస్త్రపు సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి క్వాంటం కంప్యూటర్లు. అలాగే DNA (అంటే జీవ కణాలలోని వారసవాహికలు) లో నిబిడీకృతమైన సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి DNA కంప్యూటర్లు.

కంప్యూటర్లు చెయ్యగలిగే పనులు

ఈ రోజుల్లో కంప్యూటర్ల చేత మనం చేయించలేని పనులు లేవు. కంప్యూటర్ల సహాయం లేకుండా రైల్వే రిజర్వేషన్లు జరగవు, విమానాలు నడవవు, రాకెట్లు ఎగరవు, బేంకులో డబ్బు ధరావరతు కాదు, కార్లు నడవవు, కర్మాగారాలు నడవవు, టెలిఫోనులు పని చెయ్యవు, ఆఖరికి కంప్యూటర్ల సహాయం లేకుండా కొన్ని శస్త్ర చికిత్సలు కూడ జరగవు. కంప్యూటర్లు ఆగిపోతే ఆధునిక సమాజం ఆగిపోతుంది. కంప్యూటర్లు ఇంత ప్రతిభ చూప గలుగుతున్నాయంటే దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి:

  • కంప్యూటర్లు అత్యంత వేగంతో పని చేస్తాయి.
  • అలుపు లేకుండా చేసిన పనినే పదే పదే చెయ్యగలవు.
  • చేసే పని తప్పులు లేకుండా చేస్తాయి.

వచ్చిన చిక్కల్లా కంప్యూటర్లు ఎప్పుడు ఏ పని చెయ్యాలో అంతా మనం అరటిపండు ఒలిచినట్లు విడమర్చి చెప్పాలి. మనం చెప్పటంలో తప్పుంటే కంప్యూటరు తప్పు చేస్తుంది కాని తనంత తాను తప్పు చెయ్యదు.


కంప్యూటరు ఎప్పుడు ఏమిటి చెయ్యాలో విడమర్చి చెప్పే ఆదేశాలని ఇంగ్లీషులో instructions అని కాని commands అని కాని అంటారు. ఇలా ఆదేశాలని ఒక క్రమంలో రాసినప్పుడు దానిని తెలుగులో 'క్రమణిక' అనిన్నీ ఇంగ్లీషులో ప్రోగ్రామ్‌ (program) అని అంటారు. ఇలా ప్రోగ్రాములు రాసే ప్రక్రియని ప్రోగ్రామింగ్ (programming) అంటారు. ఈ ప్రోగ్రాములు రాసే వ్యక్తిని ప్రోగ్రామర్‌ (programmer) అంటారు. కంప్యూటర్‌లో రకరకాల పనులు చెయ్యటానికి రకరకాల క్రమణికలు వాడతారు. ఒకొక్క రకం ప్రోగ్రాము కి ఒకొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి ఎసెంబ్లర్‌, కంపైలర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మొదలైనవి కొన్ని రకాల ప్రోగ్రాములు. ఈ ప్రోగ్రాములన్నిటిని కలిపి ఇంగ్లీషులో సాఫ్‌ట్‌వేర్‌ (software) అంటారు. ఇలా ప్రోగ్రామర్లు రాసిన సాఫ్‌ట్‌వేర్‌ ని కంప్యూటర్‌ లోనే ఒకచోట భద్రపరుస్తారు. ఇలా భద్రపరచిన ప్రదేశాన్ని కొట్టు (store or memory) అంటారు. ఈ కొట్టు గదిలో దాచిన సాఫ్‌ట్‌వేర్‌ లోని ఆదేశాలని ఒకటీ ఒకటి చొప్పున కంప్యూటరు బయటకి తీసి, చదివి, అర్ధం చేసుకొని, ఆ ఆదేశాన్ని ఆచరణలో పెడుతుంది. ఇదంతా దరిదాపు విద్యుత్‌వేగంతో జరిగిపోతుంది. సెకెండుకి మిలియను ఆదేశాలని ఆచరణలో పెట్టగలిగే కంప్యూటర్లు సర్వసామాన్యం.


కంప్యూటర్లని రెండు విభిన్న కోణాల నుండి అధ్యయనం చెయ్య వచ్చు. మనిషికి స్థూలమైన భౌతిక శరీరం, కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఉన్నట్లే కంప్యూటర్లకి స్థూలకాయం (హార్డ్‌వేర్‌), సూక్ష్మకాయం (software) అని రెండు భాగాలు ఉన్నాయి. సూక్ష్మ కాయం నివసించడానికి స్థూలకాయం కావాలి. అలాగే సూక్ష్మ కాయం లేక పోతే స్థూలకాయం ప్రాణం లేని కట్టె లాంటిది.


సిద్ధాంతపరంగా చూస్తే ఎటువంటి సమాచారమునయినా సంవిధానపరుచుటకు మనము కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. చర్చి-టూరింగు సిద్దాంతం ప్రకారం, ఒక నిర్దేశిత కనీస సామర్థ్యము ఉన్న కంప్యూటరుతో - అది పాకెటు డైరీ కానీవండి లేదా పెద్ద సూపరు కంప్యూటరు కానీయండి - మనము చేయగలిగే ఎటువంటి కార్యమునయినా నియంత్రించవచ్చు. కాబట్టి ఒకే రూపకల్పనను మనము వివిధ కార్యములను నెరవేర్చేటందుకు మలచవచ్చు. అవి కంపెనీలో జీతాల జాబితాలను నియంత్రించేది కావచ్చు లేదా ఫ్యాక్టరీలలో యంత్రాలను పనిచేయించే రాబోటులను నియంత్రించేవి అయినా అవచ్చు.

కంప్యూటరు పనిచేయు విధానము: భద్రపరిచిన ప్రోగ్రాము అనే ఊహ

కంప్యూటరుకు సంబంధించిన సాంకేతిక అంశాలు ఎన్ని మార్పులు చెందినా, 1940ల నుండి ఇప్పటి వరకు మార్పు చెందనిది ఈ "స్టోర్డ్ ప్రోగ్రాము ఆర్కిటెక్చరు" ('భద్రపరిచిన ప్రోగ్రాము' అనే ఊహపై ఆధారపడ్డ నిర్మాణము) మాత్రమే. దీనిని "వాన్ నోయిమన్ రూపశిల్పం" (von Neumann architecture) అని కూడా పిలుస్తారు. ఈ రూపకల్పన వలన కంప్యూటరు అనేది ఒక వాస్తవ రూపము దాల్చగలిగింది. ఈ నిర్మాణము ప్రకారము మనము కంప్యూటరును నాలుగు ముఖ్య భాగములుగా విభజించవచ్చును. ఈ భాగములనన్నిటిని అనుసంధానించుటకు 'బస్' అను తీగల కట్టను ఉపయోగిస్తారు. వీటిని ఒక క్రమపద్ధతిలో నడిపించుటకు 'టైమరు' లేదా గడియారము అను ఒక వ్యవస్థను ఉపయోగిస్తారు.

ఒక ఉదాహరణ

ఒక ట్రాఫిక్ లైటు - ప్రస్తుతం ఎరుపు చూపిస్తున్నది.

పెద్ద పట్టణాలలో, నాలుగు వీధుల మొగలలో సంచార దీపాలు (traffic lights) వాడుతున్నారు ఈ రోజుల్లో. సాధారణంగా ఈ సంచార దీపపు గుత్తిలో మూడు దీపాలు ఉంటాయి: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. ఎదురుగా ఎర్ర దీపం కనిపిస్తూ ఉన్నంత సేపూ వాహనాలు ఆగి ఉండాలి. ఎదురుగా పసుపుపచ్చ దీపం కనిపిస్తే త్వరగా కూడలి (junction)లో ఉన్న వాహనాలు కూడలిని ఖాళీ చెయ్యాలి, కూడలిలో లేనివి కూడలి లోపలికి ప్రవేశించ కూడదు. ఎదురుగా ఆకుపచ్చ దీపం కనిపిస్తూ ఉన్నంత సేపూ వాహనాలు స్వేచ్చగా కూడలి గుండా పోవచ్చు. ఇవీ నిబంధనలు. ఇంతే కాకుండా ఎర్ర దీపం నిమిషం పాటు వెలగాలి. పసుపు దీపం మూడు సెండ్లు వెలగాలి. పచ్చ దీపం నిమిషం పాటు వెలగాలి. ఏ రెండు రంగుల దీపాలు ఒకే సారి వెలగ కూడదు అని కూడ నిబంధనలు విడమర్చి చెపుదాం.

ఇప్పుడు ఆ సంచార దీపాన్ని నియంత్రించటానికి ఒక క్రమణిక (program) ఈ కింది విధంగా రాయవచ్చు.

  • 1. ముందు మూడు దీపాలనీ ఆర్పు
  • 2. ఎర్ర దీపం వెలిగించు
  • 3. నిమిషం సేపు వెలగనీ
  • 4. ఎర్ర దీపం ఆర్పు
  • 5. ఆకుపచ్చ దీపం వెలిగించు
  • 6. నిమిషం సేపు వెలగనీ
  • 7. ఆకుపచ్చ దీపం ఆర్పు
  • 8. పసుపుపచ్చ దీపం వెలిగించు
  • 9. మూడు సెకండ్లు సేపు వెలగనీ
  • 10. పసుపుపచ్చ దీపం ఆర్పు
  • 11. 2 వ అంచె దగ్గరకి వెళ్ళు.

ఈ క్రమణికలో పదకొండు ఆదేశాలు (instructions) ఉన్నాయి. కంప్యూటరు ఈ పదకొండు ఆదేశాలనీ ఒక దాని తరువాత మరొకటి అమలు పరుస్తూ, అలా అంతు లేకుండా పని చేస్తుంది.

కంప్యూటర్‌ లో భాగాలు

ఒక పర్సనల్ కంప్యూటర్‌లో ముఖ్య భాగాలు.
పర్సనల్ కంప్యూటర్ లోపల ఇలా కనిపిస్తుంది.
గణిత-తర్క విభాగము - అరిత్‌మెటిక్ అండ్ లాజికల్ యూనిట్ (ఏ ఎల్ యు)

ఏ ఎల్ యు. ఇది రెండు రకాల పనులు నిర్వర్తించును: గణిత కార్యకాలాపాలు అనగా కూడికలు (additions), తీసివేతలు (subtractions), గుణింతములు (multiplications), భాగాహారములు (divisions). రెండవ రకమయిన కార్యములు తర్కమునకు (logic) సంబంధించినవి. ఇది సెంట్రల్‌ ప్రోసెసింగ్‌ యూనిట్ లో (సి.పి.యు) ముఖ్యమైన భాగం.

నియంత్రించు విభాగము - కంట్రోలు యూనిట్

నియంత్రణ వ్యవస్త. దీనికి కేటాయించిన ముఖ్యమయిన పనులు: ఆదేశములను మరియు డేటాను మెమరీ నుండి లేదా ఐ/ఓ నుండి చదవటం, ఆ ఆదేశములను అర్ధం చేసుకోవటం, ఏ ఎల్ యు కు ఆదేశానుసారము సరిఅయిన సంఖ్యలను అందించటం, ఏ ఎల్ యు కు ఆ సంఖ్యలతో ఏమి చేయాలో చెప్పటం, వచ్చిన ఫలితములను తెరిగి మెమరీ వద్దకు గానీ ఐ/ఓ వద్దకు గానీ పంపించటం. ఈ విభాగములో కౌంటరు అను ఒక లెక్కపెట్టే పరికరము ప్రస్తుత ఆదేశము నిల్వ ఉన్న చిరునామా యొక్క జాడను ఎల్లప్పుడూ తెలుపుతూ ఉంటుంది. సాధారణంగా ఒక ఆదేశము నిర్వర్తించగానే ఈ కౌంటరు యొక్క లెక్క పెరుగును. దీని వలన తరువాతి ఆదేశమును చదువుటకు వీలగును. అప్పుడప్పుడు ప్రసుత ఆదేశమే తరువాతి ఆదేశము యొక్క చిరునామాను తెలుపును. అటువంటి సమయాలలో కౌంటరు యొక్క లెక్కను సరిచేయటమే ఆదేశముగా భావించవలెను. 1980ల నుండి ఏ ఎల్ యు మరియు నియంత్రించు విభాగము భౌతికంగా ఒకే చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూటులో ఉంచబడినవి. దానిని కేంద్రీయ సంవిధాన విభాగము - సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి పి యు) అంటారు.

కొట్టు- జ్ణాపక విభాగము - మెమొరీ యూనిట్

కంప్యూటరు యొక్క జ్ణాపకశక్తిని వరుసగా పేర్చిన గదుల పెట్టెలుగా భావించవచ్చు. ప్రతీ గదికీ ఒక ప్రత్యేక సంఖ్య చిరునామాగా ఉంటుంది. ప్రతీ గదిలో సమాచారమును భద్రపరచవచ్చు. ఈ సమాచారము కంప్యూటరుకు ఇవ్వవలసిన ఆదేశములు అయి ఉండవచ్చు, లేదా దత్తాంశాలు (డేటా, అంటే ఆదేశాలను నిర్వర్తించుటకు కావలిసిన సమాచారము) అయినా అయిఉండవచ్చు. శాస్త్ర ప్రకారం మనము ఆదేశాలను కానీ దత్తాంశాలను కానీ భద్రపరుచుటకు ఏ గది నయినా ఉపయోగించవచ్చు.

ప్రవేశ/బహిర్గ విభాగము - ఇన్‌పుట్ /ఔట్‌పుట్ యూనిట్ -(ఐ/ఓ)

ఈ విభాగము బయట ప్రపంచము నుండి సమాచారము సేకరించుటకు, మరియు ఫలితములను బయట ప్రపంచమునకు తెలుపుటకు ఒక సాధనముగా ఉపయోగపడును. ఒక మామూలు వ్యక్తిగత కంప్యూటరులో సమాచారమును ప్రవేశపెట్టుటకు కీబోర్డు మరియు మౌసులను, బహిర్గపరుచుటకు కంప్యూటరు మానిటరు, ప్రింటరు మొదలగు వాటిని ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా ఎన్నో సాధనములను కంప్యుటరుకు బయట ప్రపంచమునకు మధ్య మార్పిడికి ఉపయోగిస్తారు.

సాధారణముగా ఇటువంటి కంప్యూటరు యొక్క పనిచేయు విధానము చాలా సూటిగా ఉంటుంది. కౌంటరు యొక్క లెక్క పెరిగిన ప్రతీసారి ఒక క్రొత్త ఆదేశమును, దానికి సంబందించిన డేటాను మెమరీ నుండి చదివి దానిని నిర్వర్తించడము, తిరిగి ఫలితములను మెమరీలో బద్రపరచటం, మళ్ళీ తరువాతి ఆదేశమును స్వీకరించటం. ఈ విధముగా హాల్ట్ (ఆగుము) అను ఆదేశము వచ్చు వరకు జరుగుతూనే ఉంటుంది.

పెద్ద పెద్ద కంప్యూటర్లలో ఈ నమూనాలో కొంచం తేడా ఉండును. వాటిలో ఒక సిపియు బదులుగా అనేక మయిన సిపియులు ఉండును. సూపరు కంప్యూటర్లలో ఈ నిర్మాణము మరింత తేడాగా ఉండును. వాటిలో కొన్ని వేల సిపియులు ఉండును, అట్టి నిర్మాణములు ప్రత్యేకమయిన కార్యములకు మాత్రమే ఉపయోగించుతారు.

కంప్యూటరు శాస్త్ర విద్య

కొన్ని విశ్వవిద్యాలయాలలో కంప్యూటరు శాస్త్రాన్ని థీయరిటికల్ స్టడీ ఆఫ్ కంప్యుటేషన్ గా మరియు అల్గారిదమిక్ రీజనింగుగా భోధిస్తారు. ఈ భోధనలో మామూలుగా థీయరీ ఆఫ్ కంప్యుటేషన్ , అల్గారిథంల విశ్లేషణ , ఫార్మల్ పద్ధతులు, కాంకరెన్స్, డేటాబేసులు, కంప్యూటరు గ్రాఫిక్సు, సిస్టం విశ్లేషణ వంటి కోర్సులు చెపుతారు. ఇంకా కంప్యూటరు ప్రోగ్రామింగు కూడా చెపుతారు, కానీ దీనిని ఇతర విభాగాలకు సహాయకారిగా ఎక్కువగా భావిస్తారు, ఉన్నత కోర్సుగా కాకుండా! ఇక కొన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మరియు సెకండరీ స్కూళ్ళు కంప్యూటరు శాస్త్రాన్ని వృత్తి విద్యగా చెపుతారు, ఈ కోర్సులలో కంప్యూటరు థీయరీ అల్గారిథంల పై కాకుండా కంప్యూటరు ప్రోగ్రామింగుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ సిలబసు కంప్యూటరు విద్యను సాఫ్టువేర్ ఇండస్ట్రీకి ఉపయోగపడే ఉద్యోగులను తయారు చేయడంపైననే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది. కంప్యూటరు శాస్త్రము యొక్క ప్రాక్టికల్ విషయాలను సాధారణంగా సాఫ్టువేర్ ఇంజినీరింగ్ అని పిలుస్తారు. కాకపోతే దేనిని సాఫ్టువేర్ ఇంజినీరింగు అన వచ్చు అనే విషయము పై ఏకాభిప్రాయము లేదు. ఉదాహరణకు చూడండి పీటర్ జే. జెన్నింగ్ కంప్యూటరు సిలబస్‌లో గొప్ప సూత్రాలు , టెక్నికల్ సింపోసియం ఆన్ కంప్యూటర్ సైన్సు ఎడుకేషన్ , 2004. భారతీయ భాషల కంప్యూటర్ ప్రక్రియ కంప్యూటర్లను భారతీయభాషలలో వాడటానికి కావాలసిన ప్రామాణిక పద్ధతులను వివరిస్తుంది.

కంప్యూటింగు వృత్తులు మరియు నియమములు

ప్రస్తుత సమాజములో దాదాపుగా అన్ని వృత్తుల వారు కంప్యూటర్లను ఉపయోగించుచున్నారు. కాకపోతే విద్యాలయాలలో, కంప్యూటర్లను ఉపయోగించుటకుగాను, వాటిని నడుపుటకు కావలిసిన ప్రోగ్రాములను వ్రాయుటకు ప్రత్యేక పద్దతులను నేర్పుటకు గాను, ప్రత్యేక వృత్తివిద్యలు అవతరించినాయి. కానీ ప్రస్తుతానికి ఈ వృత్తివిద్యలకు ఉన్న నామములు, పదజాలము నిలకడగాలేవు అని చెప్పవచ్చును, కొత్త కొత్త విభాగములు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవిగా ఈ క్రింది వాటిని పేర్కొన వచ్చు:

  • కంప్యూటరు ఇంజినీరింగు

దీనిని ఎలక్ట్రానిక్ ఇంజినీరింగుకు ఒక శాఖగా భావించవచ్చు. ఈ విభాగములో మనము కంప్యూటర్ల యొక్క భౌతిక లక్షణాలు, వాటి నిర్మాణ ప్రక్రియ, నిర్మాణమునకు కావలిసిన విడిభాగముల గురించి వివరములు నేర్చుకొనవచ్చును.

  • కంప్యూటరు సైన్సు
సాఫ్టువేరు ఇంజినీరింగు
కంప్యూటరుచేత పనులు చేయించే ప్రోగ్రాములకు సంబంధించిన పద్ధతులు నేర్చుకొనుటకు, మరియు ఈ ప్రక్రియను వేగవంతము చేయుటకు, ఖర్చు తగ్గించుటకు మార్గములు, ప్రామాణికమయిన లేదా నాణ్యమయిన ప్రోగ్రాముల వ్యవస్థను సృస్టించుటకు, అవసరమైన వివిధ అచరణీయమయిన పద్ధతుల గూర్చిన అధ్యయనము జరుగును.
  • సాఫ్ట్‌వేరు పరీక్షా ఉద్యోగాలు: ఈ ఉద్యోగాలని స్థూలంగా రెండు మూడు విధములుగా చెప్పవచ్చు।
  • స్వహస్త పరీక్షకులు: సాధారణ వినియోగదారులు ప్రోగ్రామును ఎలా ఉపయోగిస్తారో అలా అన్ని సంయోజనాలలోనూ ఉపయోగించి పరీక్షిస్తారు।
  • యాంత్రిక పరీక్షకులు: ప్రోగ్రామును యాంత్రికంగా పరీక్షించేందుకు అవసరమైన ప్రోగ్రాములను వీరు రాస్తారు
టెష్ట్ టూల్స్ డెవలపరు
వీరు పరీక్షకుల బృందానికి కావలసిన రక రకాల పనిముట్లని తయారు చేస్తూ ఉంటారు। ఉదాహరణకు మెమరీ లీకు టెష్టులు, సెక్యూరిటీ టెష్టులు మొదలగున్నవి। ఈ టూల్సును అన్ని ప్రోగ్రాములవారూ ఉపయోగించవచ్చు।

కంప్యూటరు ప్రాథమికాంశాల పుస్తకాలు,ప్రజంటేషన్లు

  • ఐటిలో ప్రాథమికాంశాలు[4]
  • సి-డాక్ వారి "కంప్యూటర్ పరిఙ్ఞానం" ఇ-శిక్షక్ పుస్తకం[5]
  • కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం లో కంప్యూటర్ పరిచయం[6]
కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం

కంప్యూటరు పత్రికలు

ఇవి కూడా చూడండి